హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో మూసీ నది తీరాన్న ఉన్న కాశీ బుగ్గ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 1822లో రాజా రాఘవ్ రామ్‌జీ నిర్మించిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి 24x7 నిత్యం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు.
శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. మధుమేహం సమస్యలతో బాధపడేవారు సైతం ఇక్కడికి వచ్చి.. ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్తారు. ఈ ఆలయానికి ప్రస్తుతం రాజ్‌కుమార్ భరత్ లాల్‌జీ ట్రస్టీగా ఉన్నారు.
రోజూ తెల్లవారుజామున 3 గంటలకు పాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని భక్తులు అంటున్నారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లేవారికి శివ లింగంపై పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇంతటి విశిష్టత గల ఈ ఆలయానికి చేరుకునేందుకు భక్తులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో గతేడాది ‘సమయం’లో కథనం ప్రచురితమైంది. మూసీ నది దాటి ఆలయానికి రావాలంటే తాత్కాలికంగా నిర్మించిన వంతెన ఒక్కటే దిక్కని, నీటి ప్రవాహం పెరిగితే ఆ వంతెన మునిగిపోతుందని వార్త రాశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులు చేపట్టింది. సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసింది.Location: https://goo.gl/maps/hr9XntwoRaoiY22t7
Comments
Post a Comment